తెలుసుకుందాం!
కామ్రేడ్ వసంతాడ
రామలింగాచారి
గారి గురించి
తెలుసుకుందాం!
( ఈనెల 24 న
ఆచారి గారి 17 వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృత్యర్ధం
ఈ వ్యాసం)
- రేకా చంద్ర శేఖర రావు.
తేది: 21.11.2020.
నంబరు:
9502 181 485.
మొదటి భాగం :
.........
వీరోచిత శ్రీకాకుళ గిరిజనోద్యమం అంటే - ఆ వుద్యమ నాయకత్వం అంటే ప్రజలందరకూ తెలిసినది గిరిజన ప్రజా వుద్యమ పోరాటయోధులు అయిన వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు మాత్రమే!
ఆ వుద్యమం నుండి ఆరిక సోములు , కోరన్న , మంగన్నలు, రెంజిం, భీములు
వారి తర్వాత ఎండుదొర,
గున్నమ్మ( వెంపటాపు శాంతమ్మ), నిమ్మల కృష్ణ మూర్తి, గుంపు స్వామి తదితర వుద్యమ కారులు తయారయ్యారు.
వీరంతా ఆ వుద్యమ నాయకులు , కార్యకర్తలు. వీరందరినీ
ఏకతాటిన నడపిన ఒక సారధి , చోదకశక్తి
ఒకరున్నారు,
వారే వసంతాడ రామలింగాచారి గారు.
శ్రీకాకుళ వుద్యమ అన్ని మలుపులలో అవసరమైన కార్యకర్తల వనరులు, కేటాయింపులు, కేంద్రీకరణ తదితర నిర్మాణ విషయాలలో
అవసరమైన నిర్ణయాలు అన్నిటిలో కీలకమైన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి , పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన వసంతాడ రామలింగాచారి గారే!
తెల్ల బట్టలను చూస్తే పారిపోయే గిరిజనుడు,
మాట కోసం నిలబడే గిరిజనుడు వడ్డీ వ్యాపారస్తుల , భూస్వాముల మోసపు అప్పులు చెల్లించవద్దు అని అంటే “ససేమిరా అంగీకరించని గిరిజనుడు “
తమ ఊరిలోని చెట్లపైన ఎర్రజండా కట్టి “ మేము మీ బానిసలము కాము స్వతంత్రులము”
అని ప్రకటించడానికి కారణమయినది గిరిజన సంఘం.
అలాటి గిరిజన సంఘాన్ని గ్రామ గ్రామాన నిర్మాణం జరిగేలా చేసిన నిర్మాణ దక్షుడు
వసంతాడ రామలింగా చారి గారు.
.........
ఈ వ్యాసం శ్రీకాకుళ గిరిజనోద్యమ సమీక్షకాదు. అలాటి సమీక్షలకు ఉపయోగపడే విషయాలు వుంటే వుండవచ్చును.
ఇందులో కామ్రేడ్ వసంతాడ రామలింగా చారి గారి గురించిన విషయాల మీదనే కేంద్రీకరించడం జరిగింది. ఆయనకు గిరిజనోద్యమానికి , పార్టీ నిర్మాణానికి సంబంధించిన విషయాలకే పరిమితం అయ్యాను. ఇంకా రావలసిన విషయాలు, చెప్పిన విషయాలలో కూడా స్పృశించాల్సిన కోణాలు వుండే అవకాశం వుంది.
ఈ వ్యాసంలో పొరపాటులు గానీ, తప్పులు గానీ దృష్టికి వస్తే సరి చేస్తాను.
అలాగే ఈ వ్యాసం చివరి భాగంలో
ఈరచనకు అవసరపడిన పుస్తకాల వివరాలు
తెలిపాను.
................
కామ్రేడ్ వసంతాడ రామలింగాచారి గారు
వసంతాడ మల్లయ్యాచారి, రామాయమ్మ దంపతులకు
21 డిసెంబరు 1929 తేదీన విజయనగరంలో జన్మించారు. స్వర్ణ కార కుటుంబం అయినప్పటికీ ఆచారి గారి తాత, తండ్రి ఆయుర్వేద వైద్యులుగా
పని చేసేవారు. వారిది ఆర్ధిక రీత్యా మద్యతరగతి కుటుంబం.
వైద్యం అవసరాల రీత్యా అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా
వచ్చే ప్రజలపట్ల విసుగు , అలసట లేకుండా ఎంతో ఓపిక , శ్రధ్దతో ఆచారి గారి నాన్న గారు సేవ చేసేవారు అది ఆచారి గారి మీద చాలా ప్రభావం కలిగించింది. అలాగే వారి అమ్మ గారు శ్రమ జీవులను గౌరవించే విధానం, “ శ్రమ జీవుల శ్రమను డబ్బులతో
కొలవలేము “ అని ఆమెచెప్పి , శ్రమజీవుల పట్ల పేదల పట్ల ఆమె చూపే దయాగుణం ఆయనపైన చాలా ప్రభావం చూపింది.
ఈ విషయాలను ఆచారి గారు తన బాల్య విషయాల అనుభవాలలో చెప్పారు.
విజయనగరం కస్పా హైస్కూలులో SSLC వరకు ఆయన చదివారు. నలుగురు అన్నదమ్ములలో రెండవ వారైన రామలింగాచారి , తన కుటుంబంలో అప్పటికే పార్టీ పద్దతులను ప్రవేశ పెట్టిన అన్నయ్య వీరేశలింగాచారి
గారి నుండి స్ఫూర్తి పొందారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతకాలం - 1950-51 ప్రాంతంలో పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా, కొరియర్ గా ఆచారి గారు పనిచేశారు. ఆ కాలంలో వారి అన్నయ్య కూడా అక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో వున్నారు.
ఆ జిల్లా ప్రముఖ నాయకులకు కొరియర్ గా పనిచేసిన ఆచారి గారు వారి నుండి అనేక విషయాలు నేర్చుకోవడమే గాక, భవిష్యత్తులో పార్టీ టెక్ పనులపై మంచి అవగాహన పొందారు.
ఆకాలంలోనే తెలంగాణా సాయుధ పోరాట వుద్యమ కార్యకర్తల ద్వారా వారి విలువయిన అనుభవాలను తెలుసుకుని స్ఫూర్తిని పొందారు.
ఆ కాలంలోనే వీరోచిత తెలంగాణా సాయుధ పోరాట అనుభవాలను అధ్యయనం చేసి తన భవిష్యత్తు కార్యాచరణకు ఉపయోగ పడేలా చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తగా పని చేస్తున్న
రామలింగాచారి గారిని
1952లో శ్రీకాకుళం జిల్లా పార్టీ అవసరాల రీత్యా శ్రీకాకుళానికి ఆనాటి రాష్ట్ర కమిటీ పంపింది.
ఆనాటి శ్రీకాకుళం జిల్లాలోని బొబ్బిలి తాలూకా ప్రాంత బాధ్యుడిగా ఆచారి గారు పని చేయ ప్రారంభించారు.
బొబ్బిలి ప్రాంత పార్టీ బాధ్యతలు తీసుకున్న కొద్ది కాలంలోనే
ఆ ప్రాంతంలో రైతు సంఘాలు, కూలి సంఘాలు, గీతకార్మిక సంఘాలు, యువజన , విద్యార్థి, ఉపాధ్యాయ తదితర రంగాలలో సంఘ నిర్మాణం అభివృద్ధి చేయడమే గాక తనదైన కేంద్రీకరణ పద్దతుల ద్వారా అతి కొద్ది కాలంలోనే ప్రజా సమస్యలపై వుద్యమ నిర్మాణాలు చేపట్టారు.
ఉపాధ్యాయ వుద్యమం మీద ఆయన చేసిన కేంద్రీకరణ ఫలితంగా అనేకమంది వుపాధ్యాయులు పార్టీ లోకి రాగలిగారు. ఆచారి గారితో పాటు పార్టీలోకి షుమారుగా
ఒకే కాలంలో వచ్చిన ఆదిభట్ల కైలాసం గారు కూడా వుపాధ్యాయుడు.
ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టి కార్యకర్తగా పని చేసేవారు.
వుపాధ్యాయ సంఘాన్ని బలవత్తర సంఘంగా పార్టీ నిర్మించిన కారణంగా ఆ ప్రజా సంఘం ప్రజా వుద్యమాలకు కార్యకర్తలను సృష్టించే వనరుగా వుండేది.
ఈ కృషిలో ఆచారిగారి పాత్ర ప్రముఖమయినది.
వుపాధ్యాయ సంఘం ద్వారా అనేకమంది వుపాధ్యాయులు- మేడవరపు రమణ మూర్తి, పైలా వాసుదేవ రావు,
వావిలపల్లి సత్యనారాయణ వంటి జిల్లా పార్టీ నాయకులు
వచ్చారు, వీరంతా పార్టీ నిర్మాణంలో మరియు గిరిజనోద్యమ నిర్మాణంలో చురుకయిన పాత్ర నిర్వహించిన వారే.
వీరే కాకుండా మార్పు బాలకృష్ణమ్మ, ఆదిభట్ల వెంకట చైనులు, బొడ్డేపల్లి అప్పయ్య , PV రమణ మూర్తి తదితరులు అందరూ ఆ జిల్లా ఉపాధ్యాయ రంగం వారే.
ఇంకా ఉపాధ్యాయ రంగం నుండి వుద్యమానికి అజ్నాతంగా సాయపడే కార్యకర్తలను లెక్క పెట్టలేనంత మందిని పార్టీ తయారు
చేసుకుంది
బొబ్బిలి తాలూకాలో బూర్జివలస వాస్తవ్యుడయిన వెంపటాపు సత్యనారాయణ గారు
పార్వతీపురం ఏజన్సీ మొండెంఖల్లు దగ్గరలోని కొండబారిడి గ్రామంలో వుపాధ్యాయుడిగా
పనిచేశారు.
రాజకీయ అవగాహన లేనప్పటికీ అప్పటికే గిరిజనులను సంఘ నిర్మాణం చేయడంలో మెళకువలు తెలిసిన పల్లె రాములు మాస్టారి
పరిచయం అత్యంత చొరవ కలిగిన సత్యంగారికి ఎంతో తోడ్పడింది.
పల్లె రాములు గారు ఆతర్వాత
ఆ వుద్యమంలో నిలబడలేక వెనుకకు పోయినప్పటికీ
ఆనాటి ప్రారంభ దశలో
ఆయన కృషి ఎన్నదగినది.
సత్యం గారిని గిరిజనులు “కొండబారిడి గురువు”
అని గౌరవంగా పిలిచేవారు.
ఆదిభట్ల కైలాసం గారు
ఉపాధ్యాయుడు కాక ముందునుండే కమ్యూనిష్టు పార్టీ
ప్రభావంలోకి వచ్చారు.
1955 కాలం నుండే పార్వతీ పురం తాలూకా పార్టీ కార్యదర్శిగా పని చేయడం ప్రారంభించారు.
వారి సొంత వూరు కారివలస పార్వతీపురం తాలూకాదే!
తన తండ్రి
దత్తివలస, చిలకాం, కారివలసలకు ఈనాందారు.
ఆ ఈనాం కింద 1800 ఎకరాల పైగా భూమి వుంది, ఆ భూమి కౌలు దారులకు, పేదరైతులకు చెందడం కోసం ఆనాడు వున్న చట్టాల ప్రకారమే పోరాడి విజయం సాధించారు కైలాసం గారు.
పార్వతీపురం కార్యదర్శి బాధ్యతలలో భాగంగా భద్రగిరి ఏజన్సీ పైన కైలాసం గారు కేంద్రీకరించారు.
ఆనాటి శ్రీకాకుళం జిల్లా రెండు డివిజన్లుగా వుండేది. పార్వతీపురం డివిజన్ లో పార్వతీ పురం, బొబ్బిలి , సాలూరు, పాలకొండ, పాతపట్నం తాలూకాలు వుండేవి.
-(1979 లో చీపురుపల్లి , సాలూరు, బొబ్బిలి, పార్వతీ పురం తాలూకాలను శ్రీకాకుళం జిల్లా నుండి వేరు చేసి , వైజాగ్ లోని కొన్ని తాలూకాలను కలిపి విజయనగరం జిల్లాని ఏర్పరిచారు. మన ఈ వ్యాస సందర్భంలో శ్రీకాకుళం జిల్లా అంటే 1979కు ముందు వున్న పాత శ్రీకాకుళం జిల్లానే! )-
బొబ్బిలి పార్టీ బాధ్యుడు అయిన రామలింగాచారి గారు
పార్వతీపురం డివిజన్ బాధ్యతలు కూడా చూసేవారు. ఆరకంగా ఆచారి గారు పార్వతీపురం, పాలకొండ ఏజన్సీలతో కూడా ఘనిష్ట సంబంధాలు కలిగి వుండే వారు.
ఆరకంగా సత్యం, కైలాసం గార్లతో పాటు
ఆచారి గారు గిరిజన సంఘ కార్యకలాపాలలో
నిమగ్నం అయ్యే వారు. దీనిలో పార్టీ నిర్మాణ బాధ్యుడిగా , నిర్మాణ దక్షుడిగా ఆచారి గారి కృషి బయటకు కనపడిన దానికంటే కూడా ఆంతరంగిక కృషి చాలా ఎక్కువ వుండేది.
ఈకృషి 1958 నాటి నుండి నిర్దిష్టంగా సాగింది. 1962 లో ఆచారి గారు శ్రీకాకుళం జిల్లా పార్టీ
కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
అప్పటి నుండి గిరిజనోద్యమ నిర్మాణం
చాలా వేగవంతం అయింది.
రెండవ భాగం:
బొబ్బలి ప్రాంత బాధ్యుడిగా వుంటూ ఆ ప్రాంత పార్టీ ,
ప్రజా సంఘాల కార్యక్రమాలలో పొందిన అనుభవం జిల్లా కార్యదర్శిగా ఎన్నికయిన తర్వాత
ఇతర ప్రాంతాలకు, రంగాలకు ఆచారి గారు విస్తరింప చేశారు. అవసరమయిన ప్రాంతాలకు పార్టీ కార్యకర్తలను కేటాయించడంలోను,
కార్యకర్తల శక్తి సామర్ధ్యాలు గమనించి అందుకు అనుగుణంగా పనులు కేటాయించి, వారి పనులలో కేంద్రీకరించే విధంగా motivate చేయడం చేసేవారు.
ఆయన కార్యదర్శిగా వున్న కాలంలోనే సోంపేట తాలూకాలో పంచాది క్రిష్ణమూర్తి మరియు పైలా వాసుదేవరావు , కొత్తూరులో చౌదరి తేజేశ్వర రావు,
నర్సన్నపేట ప్రాంతంలో
మామిడి అప్పలసూరి,
బొబ్బిలి ప్రాంతంలో వావిలపల్లి సత్యనారాయణ, భద్రగిరిలో కైలాసం , సత్యంలు వారికి అండగా దుప్పల గోవిందరావు వంటి వారు పూర్తి కాలం కార్యకర్తలుగా పని చేసేవారు. ఏజన్సీలో
ఆరికసోములు, ఎండుదొర, పైలా భీముడు, గున్నమ్మ, నిమ్మల కృష్ణమూర్తి , ఆరిక గుంపుస్వామి వంటి రెండో స్తాయి గిరిజన నాయకులు తయారయ్యారు. ఆతర్వాత వందలాది
గిరిజనులు మూడవ స్తాయి కార్యకర్తలుగా
వున్నారు.
వీరందరినీ తయారు చేయడంలో శ్రీకాకుళ జిల్లా కమిటీ అద్భుత పాత్ర నిర్వహించింది,
ఆ రకంగా జరిగిన కృషికి సూత్రధారిగా రామలింగా చారి గారు వున్నారు.
అంతేకాదు అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి, యువజన , రైతాంగ, కూలీ , ఉపాధ్యాయ సంఘాలు నిత్య చలనంలో నిరంతర కార్యక్రమాలలో వున్న ఫలితంగా వివిధ స్తాయిలలో కార్యకర్తలు తయారయ్యేవారు, ఉపాధ్యాయ సంఘ జిల్లా కమిటీలోని సభ్యులు అయితే పార్టీకి, గిరిజనసంఘానికి రిజర్వ్ ఫోర్స్ గా వుండేవారు.
నిరంతర ప్రజా కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో పార్టీ ప్రజా పునాది విస్తారంగా పెరిగింది. జిల్లాలోని మైదాన ప్రాంతాలలో అనేక వందల గ్రామాలు పార్టీకి అండగా నిలిచాయి.
అదే ఏజన్సీలో అయితే
గిరిజన గ్రామాలన్నీ
ఎర్రజండా గ్రామాలుగా మారాయి.
.........
1967 అక్టోబరు 31న మొండెంఖల్లు మహాసభలకు వేలాది మంది గిరిజనులు సన్నద్దమయి బయలు దేరారు, భూస్వామి మేడిద సత్యం చేసిన కాల్పులలో కోరన్న, మంగన్నలు అమరులు
అయ్యారు.
అంతకుముందు కాలంలో గిరిజనులు తమ ప్రత్యక్ష కార్యాచరణ వుద్యమాల ద్వారా అనేక పాఠాలు నేర్చుకున్నారు.
మాటకు కట్టుబడి వుండే గిరిజనుడి ఉత్తమ మానవీయ స్వభావాన్ని తమ స్వార్ధానికి వుపయోగించుకుని భూములనుండి గెంటి వేశారు భూస్వాములు.
గిరిజన సంఘము, కమ్యూనిష్టు పార్టీలు
వారిని అనేక పోరాటాల ద్వారా విజ్నాన వంతులను చేశాయి. అప్పులు,వడ్డీలు ,
పిచ్చి కొలతలు,
ఖండ గుత్తలు,
వస్తు మార్పిడిలో మోసం - ఉదాహరణకు బస్తా చింతపండుకు
కేజి ఉప్పు లేక లీటర్ కిరోసిన్ ఇవ్వడం- , పాలేర్లకు అతి తక్కువ జీతాలు ఇవ్వడం మొదలయిన సమస్యలపైన ప్రజలను నిత్యం కదిలించి గిరిజనుల కోర్కెలను సాధించారు.
ఆ సందర్భంగా అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పిన ఫలితంగా ఈ ప్రభుత్వ రాజ్యాంగ యంత్ర వర్గ స్వభావం గురించిన ప్రాధమిక పాఠాలు తమ జీవిత అనుభవాల నుండే గిరిజనులు నేర్చుకున్నారు.
ఆ పాఠాలనుండి
తాము కోల్పోయిన భూములను సాధించుకోవాలి అని, అది గిరిజన సంఘ సంఘటిత శక్తి ద్వారానే సాధ్యం అవుతుందనే అవగాహనకు వస్తూ వున్న సందర్భంలో జరుగుతున్న గిరిజన సంఘ మహాసభలో పాల్గొనేందుకు వేలాదిగా గిరిజనులు తరలి వస్తున్నారు. అలా మహాసభలకు తరలి వస్తున్న గిరిజనులపైన కాల్పులు జరపగా కోరన్న, మంగన్నలు అమరులు అయ్యారు.
ఆ సందర్భంగా వచ్చిన ప్రజా వెల్లువ గిరిజన సంఘటిత శక్తిని భూస్వాములకు తెలపాలని
చాటి చెప్పింది, విప్లవ శంఖం పూరించింది.
ఈ కాలం తర్వాత విప్లవ కమ్యూనిష్టు వుద్యమంలో వచ్చిన అతివాద ధోరణులు ఫలితంగా
అంతకుముందు నుండి అనుసరిస్తున్న ప్రజా పంధా స్తానే వెంటనే శతృవుల అంతు చూడాలనే దృక్పధం ముందుకు వచ్చింది.
ఆ సందర్భంగా వచ్చిన అతివాద దృక్పథాన్ని
జిల్లా కమిటీ మెజారిటీ
బలపరచగా , దానిని వ్యతిరేకించిన రామలింగాచారి గారు
తన జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేసి, ఆ ఏజన్సీ ప్రాంతం నుండి బయటకు వచ్చారు.
ఆనాటి ఆంధ్ర కమ్యూనిష్టు విప్లవకారుల నాయకత్వంలో- టియన్ , డివి, సిపి ల నాయకత్వంలో రాష్ట్ర కమిటీ నుండి విశాఖ, తూర్పు గోదావరి ఏజన్సీ ప్రాంతాలలో గిరిజనోద్యమ కర్తవ్యాల బాధ్యతను ఆచారి గారు చేపట్టారు .
రామలింగాచారి గారు తన విశాఖ, తూర్పు గోదావరి ఏజన్సీ సర్వేలో భాగంగా రంపచోడవరం, దేవి పట్నం ప్రాంతం , కొండమొదలు ప్రాంతం గిరిజనోద్యమాలకు అనుకూలమైనదని
భావించి ఆ ప్రాంతంలో కేంద్రీకరణ కృషి ప్రారంభించాలని చెప్పారు, అందుకు అనుగుణంగా రాష్ట్ర కమిటీ బాధ్యుడిగా గైడన్సు ఇచ్చారు.
ఆ కాలంలో1969 సెప్టెంబరు నెల 7 వ తేదీన కానివాడలో ఆచారి గారు అరెస్టు అయ్యారు. ఆయనతోపాటు
కమ్మెల భాస్కర రావు, శరత్ చంద్ర బోసు, నక్కా అప్పారావు రెడ్డి మొదలయిన వారు అరెస్టు అయి అక్రమ కేసులలో ఇరికించ బడ్డారు.
అలాగే ఆ ఏజన్సీ ప్రాంతంలో గొడుగురాయి ప్రాంతంలో భూముల సమస్యలపై పనిచేస్తున్న సోమాచారి గారు కూడా అరెస్టు అయ్యారు.
ఆ కాలంలోనే పార్టీ నిర్ణయం ప్రకారం
రాష్ట్ర విద్యార్ధి నాయకుడయిన సింహాద్రి సుబ్బారెడ్డి , గుంటూరు జిల్లా విద్యార్థి నాయకుడయిన
పి.వి. రమణా రెడ్డి , వ్యవసాయ కూలీ నాయకుడయిన మోషే (సోమయ్య ) తదితరులు కొండమొదలు గ్రామము , దాని పరిసర గిరిజన గూడేలలో ( Hamlets లలో) పని చేయ ప్రారంభించారు, అవన్నీ కలిపి కొండమొదలు పంచాయతీగా వున్నాయి.
సింహాద్రి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో
కొండమొదలులో
ప్రజా వుద్యమ దృక్పధంతో పని ప్రారంభించి, గిరిజనులను పీడించే ప్రతి సమస్యలో - పాక్షిక , ఆర్ధిక సమస్యల నుండి భూమి సమస్య వరకు చేపట్టి ప్రజలను నిత్యం ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా చైతన్య పరిచారు. కొద్దికాలంలో
ఒక ఆదర్శవంతమైన , ప్రజా పంథాకు నమూనాగా వుండే విధమైన కృషి చేశారు.
కొండమొదలుకు ఒక చారిత్రక ప్రాధాన్యత
వచ్చే విధంగా
కృషి చేశారు.
ఈ తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీ వుద్యమ నిర్మాణ నిర్ణయాలు అన్నిటిలో ఆనాటి రాష్ట్ర కమిటీ నుండి ఆ జిల్లాకు బాధ్యుడయిన వసంతాడ రామలింగాచారి
గారి పాత్ర
గుర్తించదగినదిగా , ప్రముఖమైనదిగా వుంది.
ఇక్కడ గమనించ వలసిన ముఖ్య విషయం తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభ కాలంలో అనుసరించిన పని పద్దతులు శ్రీకాకుళంలో అనుసరించిన పని పద్దతులు మద్య సామీప్యతలు వున్నాయి, ఈ రెండు చోట్ల అనుసరించింది ప్రజా పంధా ( mass line) పని పధ్దతులే!
అలాగే శ్రీకాకుళంలో అనుసరించిన పని పద్దతులు కొండమొదలు ప్రాంతంలో అనుసరించిన పని పద్దతులు ఒకే విధమైనవే!
మూడవ భాగం
రేపు చూడండి ——>
..........మూడవ భాగం:
తెలుసుకుందాం!
కామ్రేడ్ వసంతాడ రామలింగాచారి గారి గురించి
తెలుసుకుందాం!
- రేకా చంద్ర శేఖర రావు.
నంబరు:
9502 181 485.
..............
సిపిఐ, సిపియమ్ లలో ఆచారి గారు పనిచేసిన కాలంలో కూడా మిగతా రాష్ట్రంలోని జిల్లాలలో ఎక్కడా జరగని విధంగా ఒక్క శ్రీకాకుళంలోనే
విశాల ప్రజా వుద్యమ పునాది గలిగిన గిరిజన ప్రజా వుద్యమం జరగటానికి గల కారణాలు ఏమిటి?
ఎన్నికలు, తదితర చట్టపర వుద్యమాలు, పోరాటాల మీదనే ఆనాటి పార్టీ - సిపిఐ ఆతర్వాత సిపియమ్ - కేంద్రీకరిస్తున్న కాలంలో శ్రీకాకుళం జిల్లాలో అందుకు భిన్నంగా గిరిజన రైతాంగ వుద్యమం పెరగడానికి కారణం ఏమిటి?
ఆనాటి శ్రీకాకుళ జిల్లా పార్టీకి మార్క్సిజం పట్ల వున్న అచంచల విశ్వాసం, వర్గపోరాటం అనేది నిరంతరం చలనశీలతతో
సాగించ వలసిన ఆవశ్యకతను ఆ కమిటీ గుర్తించిన ఫలితంగాను, అత్యంత పీడితులయిన గిరిజన ప్రజల బాధల పట్ల
ఆ జిల్లా కమిటీ యొక్క మమేకత కారణంగాను
అది సాధ్యం అయింది. అలాటి జిల్లా కమిటీకి సారధ్య బాధ్యతలు నిర్వహించడంలో అంకిత స్వభావము, కార్య దీక్ష , నిర్మాణ దక్షత మొదలయిన లక్షణాలు గల రామలింగాచారి గారి నాయకత్వం కారణం అయ్యాయి.
అందుకే ఆ జిల్లాలో
రామలింగాచారి గారికి “ గురువు గారు” - ఉపాధ్యాయుడు , టీచర్ అనే అర్ధంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే గాక వుద్యమ ప్రజలందరూ పిలుచుకునే వారు.
.....
1973 లో బెయిల్ పై వచ్చిన తర్వాత శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో తన కృషిని ఆచారి గారు తిరిగి ప్రారంభించారు.
ప్రభుత్వ క్రూర నిర్బంధం ఫలితంగా
వందలాది ప్రజలు , కార్యకర్తలు , నాయకులు ఆ జిల్లాలో అమరులయ్యారు. గిరిజన ప్రాంతం అంతటా పోలీసు క్యాంపులు- ప్రత్యేక పోలీసు దళాలతో నింపి వేశారు, ప్రజలను
భీతావహులను చేశారు.
అలాటి ప్రజలకు తగిన మానసిక స్థయిర్యం కలిగించడానికి ఆచారి గారు తీవ్ర కృషి చేశారు. జిల్లాలో మరియు ఏజన్సీలో తరిమెల నాగిరెడ్డి గారితో బహిరంగ సభలను ఏర్పాటు చేయించి ప్రజలలో కదలిక తీసుకు వచ్చారు.
విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో పాత సంబంధాలను అన్నిటినీ ఆచారి గారు పునరుధ్దరింప చేశారు.
విశాఖ జైలులోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చలు నడిపి వారిని పార్టీ వైపు తీసుకు వచ్చారు.
ఇది ఆనాడు పార్టీ పలుకుబడి పెరగడానికి , పాత వుద్యమ శ్రేణులు మరల తిరిగి రావడానికి తోడ్పడింది.
విశాఖలో కొత్తగా కార్మికులలో పార్టీ నిర్మాణ కృషి చేశారు.
బొబ్బిలి ప్రాంతంలో వుండే పార్టీ సంబంధాలనే గాక ప్రజా పునాదిగల గ్రామాలను మరల పార్టీకి అందించారు.
నామ మాత్రంగా వున్న కళాసీ సంఘాన్ని ( ముఠా కూలీ సంఘాన్ని ) పటిష్టంగా నిర్మించారు , విప్లవ కారులు ఏ పార్టీలలో వున్నా ఒకే సంఘంలో కలసి ఐక్యంగా పనిచేయాలి అనే అవగాహన బలంగా కలిగించారు.
ఆ అవగాహన ప్రకారమే కామ్రేడ్ గంటి ప్రసాదం గారిని ఆ సంఘంలో నాయకత్వ స్తానంలో
వుండేలా చేశారు. ఆతర్వాత సుదీర్ఘ కాలం ఆ సంప్రదాయాన్ని అమరులు కామ్రేడ్స్ గంటి ప్రసాదం, శ్రీకాకుళ రామారావులు
వేరే రెండు పార్టీలలో వున్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటించారు.
పార్వతీ పురం కుట్ర కేసు నిర్వహణలో నాగిరెడ్డి గారికి చేదోడుగా ఆచారి గారు నిలిచారు.
1975 ఎమర్జన్సీకి ముందు ఏర్పడిన భారత కమ్యూనిష్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్ర కార్యదర్శిగా దేవుల పల్లి వెంకటేశ్వర రావు గారు , రాష్ట్ర కార్యదర్శిగా వసంతాడ రామలింగాచారి గారు
ఎన్నికయ్యారు.
1975 ఎమర్జన్సీలో రాష్ట్ర కార్యదర్శిగా చాలా చురుకుగా ఆచారి గారు వ్యవహరించారు. వివిధ జిల్లాలకు అవసరమైన నిర్ణయాలు- వుద్యమ కార్యకలాపాలు , కేడరు కేటాయింపులు , కేడరును ప్రమోటు చేయడం వంటి విషయాలలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బూటకపు ఎదురు కాల్పులకు వ్యతిరేకంగా నిజనిర్ధారణ కమిటీ ఏర్పడి పనిచేయడం ఆ కాలంలోనే జరిగింది.
1976 జూలై 28 న తరిమెల నాగిరెడ్డి అమరుడు అయ్యారు.
ఇది ఆ పార్టీకి , విప్లవోద్యమానికి పూడ్చలేని లోటు.
1977లో తనకు ఏర్పడిన విభేదాల ఫలితంగా రాష్ట్ర కార్యదర్శిగా ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా రామలింగాచారి
గారు వైదొలగారు.
ఈ పరిణామం రాష్ట్ర పార్టీలో తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా శ్రీకాకుళ వుద్యమానికి
బాగా నష్టం కలిగించింది.
ఈ పరిణామాలను నివారించడంలో
ఆచారి గారి తొందరపాటుతో పాటు ఆనాటి పార్టీ నాయకత్వ వైఫల్యం వుందనే అభిప్రాయం
కూడా ఒకటి వుంది.
అందరినీ కలుపుకు రాగలిగిన తరిమెల నాగిరెడ్డి గారు లేని లోటు ఈ పరిణామాన్ని
నివారించలేక పోయింది. మౌలిక సిద్దాంత విభేదాలు లేని సందర్భంగా కూడా ఇలాటి విభేదాలను నివారించు కోలేక పోవడం , సర్దుబాటు చేసుకోలేక పోవడం విచారకరమైన విషయం.
ఏమయినా
గతాన్ని ఎవరూ మార్చలేరు , గత అనుభవాలు గుణపాఠాలుగా మాత్రమే
ఉపయోగ పడతాయి.
ఆతర్వాత కాలంలో పరిమిత వనరులతో ఆచారి గారు తన కార్యక్రమాలను ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు విప్లవ కారుల ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో కొనసాగించారు.
1988లో నూతనంగా ఏర్పడిన భారత కమ్యూనిష్టు విప్లవ కారుల కేంద్రం (CCRI ) సంస్తలో చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలలో వున్నారు. ఆతర్వాత కొన్ని సంస్తలు కలసి ఏర్పడిన భారత కమ్యూనిష్టు పార్టీ పునర్నిర్మాణ కేంద్రం( మా-లె) లో కేంద్ర కమిటీ సహచర సభ్యుడిగా కొనసాగారు.
తన అనుభవాలను అవసరమైన సంస్తలకు అందించారు. ఆయన అనుభవాల రచనలను ఆచారి గారు అమరులు అయిన తర్వాత
“ వసంతాడ రామలింగా చారి గారి స్మారక కమిటీ” పుస్తకాలుగా ప్రచురించింది.
తేదీ 24.11.2003 న
తీవ్ర గుండెపోటుతో తన 74 సంవత్సరాల వయసులో ( 1929- 2003) రామలింగా చారి గారు
అమరులయ్యారు.
ఆచారి గారి జీవిత సహచరి , విజయనగరం జిల్లా పార్టీ కార్యకర్త , పార్టీకి ఆచారి గారికి కొండంత అండగా వుండే సన్యాసమ్మ ( పద్మావతి) గారు
9 వ తేది ఆగష్టు 2007న మరణించారు. వారికి ఒక కుమారుడు పేరు కృష్ణ.
నాల్గవ భాగం
రేపు చూడండి.
.............................. .......
నాల్గవ భాగం :
తెలుసుకుందాం!
కామ్రేడ్
వసంతాడ రామలింగాచారి గారి గురించి తెలుసుకుందాం!
-.
.......
కామ్రేడ్ వసంతాడ రామలింగాచారి గారి గురించి తెలుసుకోవలసినవి మరియు నేర్చుకోవలసినవి:
# రామలింగాచారి గారు
స్వీయ క్రమశిక్షణ కలిగిన పాత తరం
నాయకులలో ఒకరు.
పార్టీ కలిగించిన స్ఫూర్తి అవగాహనలతో క్రమశిక్షణ కలిగిన క్రమబద్ధమైన జీవితం గడిపారు.
# ఆయన సమయపాలనకు చాలా ప్రాధాన్యతను ఇచ్చే వారు, సమయపాలన పాటించని వారిపట్ల ఆయన గట్టి విమర్శ చేసి సరిచేయటానికి ప్రయత్నిస్తారు.
# ఆచారి గారు ఏసమయంలో పడుకున్నప్పటికీ- పనుల వత్తిడితో ఎంత ఆలస్యంగా పడుకున్నప్పటికీ
నిద్ర లేచే సమయం ఐదు గంటలకు ముందే వుంటుంది.
వెంటనే కాల కృత్యాలు తీర్చుకుని ఆయన చదువుకునే పనులు, రాసుకునే పనుల్లో వుంటారు. కార్యకర్తలకు పనులు అప్పచెప్పడం వంటి పనులు పూర్తి చేసేసుకుంటారు.
# ఎక్కడకు వెళ్ళినా తన బట్టలు తాను వుతుకు కుని ఆరేసుకుంటారు.
# నిరంతరం పార్టీ పనులు, వుద్యమ పనులు తదితర ఆలోచనలే తప్ప వేరే ఇతర ఆలోచనలే వుండవు.
# కార్యకర్తలకు తర్ఫీదు ఇవ్వడంలో క్లాసులో మంచి వుపాధ్యాయుడు
ఒక పాఠం అర్ధం అయిన తర్వాత వేరొకపాఠం
చెప్పిన విధంగా అర్ధం చేయించడం వుంటుంది.
# ప్రజా వుద్యమ సమస్యల రిపోర్టులను చాలా శ్రధ్దగా ఆలకించి
అవసరమైన సూచనలు ఇవ్వడం
చేస్తారు.
# కాలాక్షేపం ఊసుపోని కబుర్లకు ఆచారి గారు వ్యతిరేకి, అలా తాను చూస్తుండగా పార్టీ కార్యకర్తలు చేయడాన్ని అంగీకరించేవారు కాదు.
#. ఆచారి గారికి వ్యక్తిగత జీవితమే లేదా
అనే విధంగా వుండేవారు.
# తోటి విప్లవ కారులపట్ల
సిద్దాంత విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు, వ్యతిరేకతలు లేకుండా వుండేవారు.
# శ్రీకాకుళ గిరిజనోద్యమం పట్ల తరిమెల నాగిరెడ్డి గారికి వుండే మమేకత, ప్రేమ వారిద్దరి మద్య
విప్లవ మైత్రిగా సాగింది.
# ఆచారి గారి జీవితం శ్రీకాకుళ వుద్యమంతో మమేకమైన ఫలితంగా ఆయన ఆలోచనలు ఎప్పుడూ దాని గురించిన ఆలోచనలుగానే వుండేవి.
# పార్టీ నిర్మాణంలోకి విద్యార్థి రంగ కార్యకర్తలు , చదువుకున్న వారితో పాటు ; అత్యంత దోపిడీకి గురయ్యే గిరిజనులను , మైదాన ప్రాంత గ్రామాలలోని పీడిత వర్గ ప్రజలను పార్టీ నిర్మాణంలోకి సమీకరించడం అత్యంత కీలకమైనదని
ఈ విషయంలో బాగా చదువుకున్న వారిపట్ల పాటించే ప్రమాణాలు వీరికి పనికి రావని;
గిరిజన , ఇతర పీడిత ప్రజలు సమస్యలపైన, వుద్యమాలలో పని చేసేదానిని పరిగణనలోకి తీసుకుని, వారికి ప్రత్యేకంగా రాజకీయ అవగాహన కలిగించి నిర్మాణంలోకి
తగిన విధంగా ఇముడ్చుకోవాలని చెప్పేవారు.
# సిపియమ్ లో వున్నప్పుడు సుందరయ్య , నాగిరెడ్డి గార్లతో సాన్నిహిత్యం వున్నట్లు చెప్పేవారు.
# సుందరయ్య గారు
కలకత్తా నుండి విజయవాడ వెళ్ళేటప్పుడు ఆమదాలవలసలో
( శ్రీకాకుళం రోడ్ లో ) గానీ , వైజాగ్ లో గానీ రామలింగాచారి గారు ట్రయిన్ ఎక్కేవారు,
విజయవాడ వరకు ట్రయిన్ లో సుందరయ్య గారితో ప్రయాణించే విధంగా సుందరయ్య గారు చేసేవారు. ఆసమయంలో వివరంగా
శ్రీకాకుళ విషయాలు సుందరయ్యగారు చెప్పించుకుని వినేవారని,
“ ప్రతి జిల్లాకు ఒక ఆచారి వంటి కార్యకర్త అవసరం “ అని సుందరయ్య గారు అనేవారని ఆచారి గారు చెప్పేవారు.
# ఎంతటి గురుభావం వున్నా సిద్దాంత విభేదాల కారణంగా సుందరయ్య గారితో విడివడి గట్టిగా పోరాడడంలో తరిమెల నాగిరెడ్డి గారిలాగే ఆచారి గారు
కూడా నిలబడ్డారు.
సిపియమ్ నుండి విడివడిన సందర్భంలో
జిల్లా కమిటీ మొత్తాన్ని
కమ్యూనిష్టు విప్లవ కారుల వైపు తీసుకు రావడమే గాక ప్రజా పునాదిని కూడా మొత్తాన్ని విప్లవ కారుల వైపు ఆచారి గారు తీసుకు వచ్చారు. అదేరకంగా
1964 లో కూడా సిపిఐ నుండి సిపియమ్ లోకి జిల్లా కమిటీతో పాటు ప్రజా పునాదిని కూడా తీసుకు వచ్చారు. ఈరకంగా జరగడంలో జిల్లా కార్యదర్శి గా ఆచారి గారు కీలక పాత్ర నిర్వహించారు.
# ఆచారి గారు 50 సంవత్సరాల పైగా విప్లవ జీవితంలో ,
30 సంవత్సరాలు రహస్య జీవితం గడిపారు. జైలులో 7 సంవత్సరాలు వున్నారు.
# ఆచారి గారు మరణించిన తర్వాత ఆయన మొదట పార్టీ బాధ్యుడిగా పని చేసిన బొబ్బిలిలోనే సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. ఆయన నిర్మించిన కళాసీ సంఘం లోని సభ్యులు ఇతర ప్రజలు వందలాదిగా వూరేగింపుగా పాల్గొని నివాళి అర్పించారు.
అలాగే తర్వాత
“ కామ్రేడ్ వసంతాడ రామలింగా చారి స్మారక కమిటీ “
పేరుతో
తేదీ 14.12.2003న పెద్ద ఎత్తున సంస్మరణ సభ కూడా జరిగింది.
# ప్రజా వుద్యమ దృక్పథంతో పనిచేయాలి అని భావించే కార్యకర్తలకు
అనుభవాల గని ఆచారి గారి జీవితం.
జోహార్ !
కామ్రేడ్ వసంతాడ రామలింగాచారి గారు
జోహార్ ! జోహార్!
( ఈ వ్యాస రచనకు దోహద పడినవి.
1.రామలింగాచారి గారి శ్రీకాకుళ వుద్యమ రిపోర్ట్.( కోర్ట్ స్టేట్ మెంట్)
2. శ్రీకాకుళ గిరిజనోద్యమ అనుభవాలు- అవగాహన: రచన వసంతాడ రామలింగాచారి.
3. శ్రీకాకుళ గిరిజన రైతాంగ వుద్యమం - రచన : వెంకట్
4. ప్రజా పంధా పత్రిక
తేది 01.12.2003.
5. జనశక్తి పత్రిక
తేది: 01.01.2004.
6. వసంతాడ రామలింగాచారి స్మారక కమిటీ కరపత్రం.)
--------------------------------
రేకా చంద్ర శేఖర రావు.
నంబరు:
9502 181 485
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి