1, డిసెంబర్ 2020, మంగళవారం

farmers struggle at Delhi on I st December

 #రైతులు_నూతన_వ్యవసాయ_విద్యుత్_చట్టాలను_ఎందుకు_వ్యతిరేకిస్తున్నారు_ముంచుకొస్తున్న_ప్రమాదమేంటి..? ఏముకులు కోరికే చలి లో ఢిల్లీ లో ఎందుకు పోరాడుతున్నారు.....???

- ఏ.పి.రైతు సంఘం
(పెద్ద పోస్ట్..చాలా ఓపిగ్గా చదవండి)
📷 దేశంలో, రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు 60 శాతానికి పైగా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నారు. అలాంటి సాంప్రదాయక వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి బీజేపీ వ్యవసాయ సంస్కరణలను తెచ్చింది.
📷 రైతుల పంటకు కొద్దోగొప్పో ఉపయోగపడుతున్న ప్రభుత్వ మార్కెట్లను దివాళా తీయించి, ప్రయివేటు మార్కెట్లకు బీజేపీ ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. దీని వల్ల మద్దతు ధరలు రద్దు అవుతాయి. కార్పొరేట్ సంస్థలు రైతులతో భూ ఒప్పందాలు చేసుకునేటట్లు తెచ్చిన చట్టం వల్ల రైతుల భూములు కార్పొరేట్లు కాజేస్తారు. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ రైతులు, వ్యవసాయ కార్మికులకే కాదు మొత్తం భారత ప్రజలకే తీవ్ర ప్రమాదం తెస్తుంది.
📷 వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోది అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులన్నిటినీ కాలరాస్తోంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్‌ రైతాంగం ఎడల కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోంది..
📷 ఇప్పటికే పంటలను కొనడానికి అంబానీ రిలయన్స్, టాటా. బిర్లా, ఆదాని, ఐటీసి, బేయర్ వంటి పెద్ద పెద్ద గుత్త సంస్థలు వచ్చాయి | రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ఎక్కువ ధరలకు వినియోగదారులకు అమ్మి లాభాలు సంపాదిస్తున్నారు.
📷 ఒకనాడు మన దేశం నుండి ఆహారధాన్యాలు ఎగుమతులవుతుండేవి. కానీ నేడు ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల వంటనూనెలు చక్కెర, పప్పుధాన్యాలు, మొక్కజొన్న దిగుమతి చేసుకుంటున్నాయి. ఇంకా దిగుమతులను పెంచుకోవాలని WTO ద్వారా ధనిక దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం అందుకు తలొగ్గింది. ధనిక దేశాల కంపెనీలకు భారతదేశాన్ని మార్కెట్ గా మార్చుతున్నారు.
ఆ చట్టాలంటో ఒకసారి క్లుప్తంగా..
📷నిత్యావసర సరుకుల చట్టం నుంచి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెలు, నూనె గింజలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను మినహాయించింది. ఆహార ధాన్యాల ధరలు 50 శాతం పైగా పెరిగినప్పుడు... పండ్లు, కూరగాయలు, పూలు, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటల ధరలు వంద శాతం పైగా పెరిగినప్పుడు మాత్రమే...ప్రభుత్వం కలుగజేసుకుంటుందని పేర్కొంది. ఈ నిబంధన కూడా ఎగుమతి దిగుమతి వ్యాపారులకు, ఆహార అనుబంధ పరిశ్రమలకు, రిలయన్స్‌, వాల్‌మార్ట్‌ వంటి హోల్‌సేల్‌ సంస్థలకు మినహాయింపు ఇచ్చింది. వీరంతా ఎంత సరుకైనా కొని నిల్వ చేసుకుని ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఈ చట్టం ద్వారా బ్లాక్‌ మార్కెట్‌ చట్టబద్ధం అయింది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆహార భద్రతకు తిలోదకాలు ఇచ్చింది.
📷ఈ చట్టం ప్రకారం రైతులు తమ పంటలను రాష్ట్రాలు దాటి ఎక్కడికైనా తీసుకువెళ్లి ఎవరికైనా అమ్ముకోవచ్చు. వాస్తవానికి స్వేచ్ఛ వచ్చింది రైతుకు కాదు. బహుళజాతి కంపెనీలకు, ఎగుమతి దిగుమతి వ్యాపారులకు. బడా హోల్‌సేల్‌ కంపెనీలకు మాత్రమే. వారంతా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా కోట్ల రూపాయల సరుకైనా కొని లాభాలు వచ్చే ప్రాంతాలకు తరలించవచ్చు. వారికి ఇకపై ఏ మార్కెట్‌ చట్టాలూ వర్తించవు. రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ ఉండదు. ఇప్పటి వరకు రైతుల ప్రయోజనాల కొరకు పని చేస్తున్న వ్యవసాయ మార్కెట్లు, వాటి చట్టాలు కొరగాకుండా పోతాయి. ఇప్పటి వరకు రైతులు పంటలు కొనుగోలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వీర్యం అయిపోతాయి.
📷ఈ చట్టం ప్రకారం రైతు వ్యక్తిగతంగా గాని గ్రూపుగా గాని తనకిష్టమైన కంపెనీతో అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. అగ్రిమెంట్‌ ప్రకారం దుక్కి దున్నే ట్రాక్టర్‌ నుండి కోత కోసే హార్వెస్టర్‌ వరకు యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు అన్నీ... కంపెనీలు అంగీకరించినవే ఉపయోగించాలి. వాటన్నిటిలోనూ వారికి వాటాలు వుంటాయి. వారికి లాభాలు వస్తాయి. అగ్రిమెంట్‌లో రాసుకున్న ప్రకారం రైతులు పండించిన పంటలను సకాలంలో, నాణ్యత ప్రమాణాలతో, ఆహార భద్రత ప్రమాణాలతో, అంగీకరించిన గ్రేడ్లలో సరఫరా చేయాలి. ఏ లోపం జరిగినా వారికి ఇచ్చే రేటు తగ్గించవచ్చు, అగ్రిమెంట్‌ లోనే పంటకు చెల్లించే ధర నిర్ణయిస్తారు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలతో సంబంధం లేదు. స్వామినాథన్‌ కమిషన్‌ సూచనలతో సంబంధం లేదు. ఒకసారి అగ్రిమెంట్‌ రాసుకున్న తరువాత మార్కెట్లో ధరలు పెరిగినా పెరిగిన ధరలు రైతుకు రావు. గ్రేడ్లు, ప్రమాణాల పేరుతో ధరలు తగ్గించడానికి చట్టం వీలు కల్పిస్తుంది.
📷రైతులకు కంపెనీలకు వ్యాపారులకు వివాదం వస్తే కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. ఆర్డీవోకు అప్పీలు చేసుకోవాలి. రైతు లాయర్ని పెట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ తీర్పు నచ్చకపోతే కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చు. చట్టం ప్రకారం రూ. పది వేల నుండి రూ. పది లక్షల వరకు ఫెనాల్టీ వేయవచ్చు. ప్రభుత్వాన్ని శాసించగల కార్పొరేట్‌ కంపెనీలు ఏమైనా చేయగలవు. కంపెనీల యజమానులైతే ఎగ్గొట్టి విదేశాలు పారిపోగలరు. రైతు ఎక్కడికి వెళ్ళగలడు. రైతు తన భూమిని వదిలి ఎటూ పోలేడు. ఆత్మహత్యలు సైతం తన భూముల్లోనే చేసుకోవడం చూస్తున్నాం.
📷కార్పొరేట్‌ వ్యవసాయం కొత్తది కాదు. సుబాబుల్‌, చెరకు, పామాయిల్‌, విత్తనాలు, బంగాళదుంపలు ఇప్పటికే కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉన్నాయి. సుబాబుల్‌ కర్రను రూ. 4300లకు కొనాలని ప్రభుత్వం, ఐటీసీ కంపెనీ, రైతులకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉన్నప్పటికీ టన్ను రూ. రెండు వేలకు మించి కొనడం లేదు. రైతు చెరుకు తోలిన 15 రోజులలో పైకం ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ నేడు దేశంలో రూ.30 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. కుప్పంలో ఇజ్రాయిల్‌ కంపెనీ నిర్వహించిన వ్యవసాయ భూములు పనికి రాకుండా చేసి వెళ్లిపోగా భూములు సాగు లోనికి రావడానికి దశాబ్ద కాలం పట్టింది. విత్తనాలు పండించే రైతులు కంపెనీలతో పడుతున్న ఇబ్బందులు ఏటా చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కిలో పెసలు ధర రూ. 72 రిలయన్స్‌ రిటైల్‌లో రూ.170 లకు, మినుములు కిలో ధర రూ.60 కాగా మినప గుళ్ళు రూ. 200 లకు అమ్ముతున్నారు. పండించే రైతుకన్నా కార్పొరేట్‌ సంస్థలు ఎన్నో రెట్లు లాభాలు తీస్తున్నాయి. అయినప్పటికీ ప్రధానమంత్రి మొదలు బిజెపి నాయకులందరూ ఈ చట్టాల వల్ల రైతులకు స్వాతంత్య్రం వచ్చిందని, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని మోసపూరిత ప్రచారం చేస్తున్నారు.
📷 కేంద్ర ప్రభుత్వం పై చట్టాలకు తోడు విద్యుత్‌ సవరణ చట్టం చేసింది. దీని ప్రకారం విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలన్నీ ప్రైవేటు వారికి చౌకగా అప్పగించడానికి, ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారులైన రిలయన్స్‌, అదానీ వంటి కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా విద్యుత్‌ చార్జీలు నిర్ణయించాలని పేర్కొంది. 20 శాతానికి మించి సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయించింది. వ్యవసాయానికి వినియోగించే మోటార్లు అన్నింటికీ స్మార్ట్‌ మీటర్లు బిగించాలని, రీడింగ్‌ ప్రకారం ఏ నెలకా నెల ముందుగానే బిల్లులు చెల్లించే పద్ధతి పెట్టాలని, ఉచిత విద్యుత్‌ స్థానంలో నగదు బదిలీ పథకం పెట్టుకోవాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని 11 రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. రైతు సంఘాలు వ్యతిరేకించాయి.కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు మద్దతు ఇస్తున్న సంఘాలు సైతం పోరాటం లోకి వస్తున్నాయి. నేడు 500 రైతు సంఘాలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడు తున్నాయి..
📷 ఇక ఈ చట్టంతో అడ్డూ అదుపు లేకుండా ధరలు మండిపోతాయి. రైతుల నుండి ధాన్యాన్ని సేకరించే FCI ని ఎత్తి వేయాలనే సూచనల అమలుకు ప్రయత్నిస్తున్నది.
FCI గోదాముల్లో 10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. నిల్వ సౌకర్యం సరిగా లేక ఏటా 5 నుండి 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పనికిరాకుండా చెడి పోతున్నాయి. వీటిని పారబోస్తున్నారు. ఇంకోవైపు కోట్లాదిమంది అర్థాకలితో మాడిపోతున్నారు. చాలామంది అకలిచావుల పాలవుతున్నారు. FCI మూతపడి ఒకసారి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఆగిపోతే ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉండవు. ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్ షాపులు ఉండవు, పేదలకు రేషన్ సరుకులు దొరకవు.
📷 కాబట్టి ఇది కేవలం రైతుల సమస్య అనుకుంటే పొరపాటు..ఇది రైతులు, వ్యవసాయ కార్మికులు, వినియగదారుల సమస్య..దేశ ఆహారభద్రత సమస్య..మొత్తం దేశ ప్రజానీకానికి చెందిన సమస్య..ఇందులో విషయాలని ప్రజలకి వివరించి ఈ చారిత్రక రైతు పోరాటానికి మద్దతు కూడగట్టడం నేడు మన ముందున్న కర్తవ్యం..
- ఏ.పి.రైతు సంఘం
No photo description available.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి